ప్రతిపక్షం, ఆగస్టు 14: హైదరాబాద్‌లో వెలుగుచూసిన గంజాయి డెడ్‌డ్రాప్ కేసులో దర్యాప్తు కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలానగర్ రాజీవ్‌కాలనీ కేంద్రంగా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ వివరాలను పరిశీలించగా.. ఈ ముఠా వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసిన 203 మంది వినియోగదారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ముఠా ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 2022 నుంచి ఇప్పటివరకు 203 మందికి గంజాయి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దాడుల సమయంలో 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి వాహనాలు, సెల్‌ఫోన్లు, ఎయిర్‌గన్ తదితర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ముఠాలో బొల్లా కిరణ్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడుల సమయంలో అధికారులను అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు తెలిపారు. పోలీసులపై కుక్కలను వదిలి భయపెట్టడంతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌పై స్క్రూడ్రైవర్‌తో దాడి చేసినట్లు వెల్లడించారు. మరో నిందితుడు భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి లైంగిక వేధింపులకు పాల్పడటం, మైనర్ బాలికలపై లైంగిక దాడులు చేయడం, గర్భం దాల్చిన యువతులపై దాడులు చేసి అబార్షన్లు చేయించడం వంటి ఆరోపణలు కూడా కిరణ్‌పై ఉన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పూర్తి వివరాలు, ఆధారాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితులు ఉంటే వారి వాంగ్మూలాలను నమోదు చేసి, ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను పోలీసులు నిర్ధారించే అవకాశం ఉంది.
గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును నిందితుడు ఇతర అక్రమ కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం గంజాయి సరఫరా నెట్‌వర్క్ మాత్రమే కాకుండా.. నిందితుల ఇతర కార్యకలాపాలపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేసిన 203 మందిని గుర్తించగా, వారిలో 100 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 81 మందికి గంజాయి వినియోగించినట్లు పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన గంజాయి సరఫరా ముఠాకు సంబంధించి మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపారు.





























