ప్రతిపక్షం, ఆగస్టు 04: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ సిస్టమ్ అమలుకు అడుగులు వేస్తోంది. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం, 2028 అక్టోబర్ నుంచి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ప్రయాణికుల వాహనాలు, సరుకు రవాణా వాహనాల్లో V2V సిస్టమ్‌ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది.
ఈ సాంకేతికత ద్వారా సమీపంలో 300 నుంచి 1000 మీటర్ల పరిధిలో ఉన్న వాహనాలు తమ వేగం, దిశ, బ్రేకింగ్ వంటి సమాచారాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పరస్పరం పంచుకుంటాయి. ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, మలుపు తిరగడం, పొగమంచు లేదా తక్కువ విజిబిలిటీ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే అలర్ట్‌లు అందుతాయి.
ఈ వ్యవస్థతో డ్రైవర్లు ముందుగానే అప్రమత్తమై స్పందించే అవకాశం పెరగడంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త భద్రతా ప్రమాణాల అమలుతో దేశంలో రవాణా వ్యవస్థ మరింత సురక్షితంగా మారే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.


















