ప్రతిపక్షం, జూలై 20: ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా రేషన్ దుకాణాలు పరిమిత రోజులపాటు మాత్రమే తెరిచి ఉంచుతుండగా.. ఇకపై నెలంతా అందుబాటులో ఉండేలా డీలర్లకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు రేషన్ సరుకుల కొరత లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


















