*మంత్రి కోమటిరెడ్డి, కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదానం
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 23: చండూరు మండలం కస్తాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నాంపల్లి సైదులుకు అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గాను జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది.నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు సంయుక్తంగా సైదులును సన్మానించి అవార్డును అందజేశారు.
16 ఏళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న సైదులు, పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆయన చేరే నాటికి కేవలం 4 గురు విద్యార్థులు మాత్రమే ఉండగా, తన కృషితో ప్రస్తుతం 18 మందికి పెంచగలిగారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించడంలో ఆయన పాత్ర కీలకమని తోటి ఉపాధ్యాయులు కొనియాడారు.
విద్యార్థుల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నాటికి మరింత పెంచడమే తన లక్ష్యమని సైదులు తెలిపారు. తనకు ఈ పురస్కారం అందించిన మంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు, మండల విద్యాధికారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


























