పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. దసరా వేళ అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

ప్రతిపక్షం, సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను దసరా సందర్భంగా పంజరాల్లో బంధించి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ హెచ్చరించింది. రాష్ట్ర పక్షిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ స్పష్టం చేశారు. దసరా పండుగ సమయంలో పాలపిట్టలను పట్టుకోవడం, పంజరాల్లో బంధించడం, ప్రజలకు ప్రదర్శించడం వంటి చర్యలకు పాల్పడకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.

దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను దర్శించుకోవడం శుభప్రదమనే నమ్మకంతో కొన్ని ప్రాంతాల్లో వాటిని పట్టుకుని ఆలయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో అటవీశాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వన్యప్రాణులను సహజ ఆవాసాల నుంచి పట్టుకుని బంధించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాలపిట్ట తెలంగాణ రాష్ట్ర పక్షి కావడంతో దాని సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

పాలపిట్టలను పట్టుకుని పంజరాల్లో ఉంచడం, వాటిని విక్రయించడం లేదా ఇతర విధాలుగా హింసించడం వంటి చర్యలకు పాల్పడితే అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పక్షులను బంధించి వాటి సహజ జీవన విధానానికి ఆటంకం కలిగించడం వల్ల వాటి మనుగడపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దసరా సమయంలో ఆలయాల్లో పాలపిట్టలను తీసుకొచ్చి ప్రదర్శించకుండా చూడాలని దేవాదాయశాఖ అధికారులను అటవీశాఖ కోరింది. ఆలయాల పరిధిలో ఇటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. పండుగ సందర్భంగా భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూనే వన్యప్రాణుల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పక్షులు, ఇతర వన్యప్రాణులకు ప్రమాదకరంగా మారుతున్న మాంజా విక్రయాలపైనా అధికారులు దృష్టి సారించారు. నిషేధిత మాంజా విక్రయాలు జరగకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాంజా కారణంగా పక్షులు గాయపడటం, మరణించడం వంటి ఘటనలను అరికట్టేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

పండుగల సమయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది. పాలపిట్టలను పట్టుకోవడం లేదా బంధించడం కాకుండా వాటిని సహజ వాతావరణంలోనే చూడాలని, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని కోరింది. రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందిన పాలపిట్టల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు సూచించారు.

Spread the love

Related News

Latest News