నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకుంటామని హామీ
హామీ అమలు చేయకుంటే ప్రజాభవన్,
డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 12: కొనాయపల్లి దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నె కళ్యాణ్‌తో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలు అధికారుల హామీతో విరమించారు. నవంబర్ 11న మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదుట ప్రారంభమైన దీక్షల నేపథ్యంలో బుధవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్‌తో బాధితులు, పోరాట కమిటీ నాయకులు సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు.ఈ సందర్భంగా దళితులు లేవనెత్తిన డిమాండ్లపై అధికారులు చర్చించి, 15 రోజుల్లో కేసులోని సెక్షన్ల మార్పుపై చర్యలు తీసుకుని నిందితుల అరెస్టుకు కృషి చేస్తామని నిర్దిష్ట హామీ ఇచ్చారు. అలాగే తుప్రాన్ ఆర్డీఓ, డీఎస్పీ కొనాయపల్లి గ్రామాన్ని సందర్శించి ఘటనపై సమగ్ర నివేదిక తయారు చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలోనూ దళితులపై దాడుల నివారణకు ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం డీఎస్పీ దీక్షా శిబిరానికి చేరుకుని చర్చల వివరాలను తెలియజేయడంతో నాయకులు నిరాహార దీక్షలను విరమించారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడివయ్య, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్, ఎంసీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జెల్ల సుధాకర్, ఏఐఏడబ్ల్యూయూ జిల్లా కార్యదర్శి కె. మల్లేశం మాట్లాడుతూ జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో దళితులు పాల్గొంటే సహించలేక కొందరు అగ్రకులాలకు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అట్రాసిటీ చట్టంపై అవగాహన లేకపోవడం, చట్టంలోని నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో నిందితులకు రక్షణ లభిస్తోందని విమర్శించారు.కొనాయపల్లి ఘటనలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు విట్టల్ రెడ్డి బాధితులను కేసులో రాజీకి రావాలని ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో ఆయన పాత్రపై సమగ్ర విచారణ జరిపి ఎఫ్ఐఆర్లో పేరు చేర్చాలని డిమాండ్ చేశారు.
దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.అధికారులు ఇచ్చిన హామీ మేరకు 15 రోజుల్లో నిందితులను అరెస్టు చేయకపోతే కొనాయపల్లి నుంచి ప్రజాభవన్, డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. దాడులకు పాల్పడిన సర్పంచ్, ఆయన అనుచరులను అరెస్టు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
- 15 రోజుల్లో చర్యలు తీసుకుంటాం: అధికారులు*
చర్చల సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కొనాయపల్లి దాడి ఘటనపై ప్రస్తుతం న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నామని తెలిపారు. గాయాల తీవ్రత, దాడి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కేసులోని సెక్షన్ల మార్పుపై చర్యలు చేపడతామని చెప్పారు. 15 రోజుల్లో నిర్దిష్ట చర్యలు తీసుకుని నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దళితులపై దాడులు చేయడం, కులవివక్ష పాటించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె. నిరంజన్ దాసు, జిల్లా కమిటీ సభ్యులు కె. నాగరాజు, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి. సంజీవ్, తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు పంచమి చంద్రం, గ్రామస్తులు రావెల్లి అర్జున్, నిరంజన్ దాసు, ప్రవీణ్, గురుదాసు, జస్వంత్, శ్రావణి, అండాలు, సత్యమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.


























