ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో నిర్మించనున్న వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భవిష్యత్ అవసరాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సమావేశంలో సీఎం మాట్లాడుతూ వరంగల్ విమానాశ్రయం ఉత్తర తెలంగాణ జిల్లాలకు కీలక కేంద్రంగా మారనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి వరంగల్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ ఓవర్‌హాలింగ్), ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తయిందని, త్వరగా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. 2028 జూన్ 2 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
వరంగల్ విమానాశ్రయ నిర్మాణ నమూనా కాకతీయుల చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం సూచించగా, దీనికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్న విమానాశ్రయంతో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ సదుపాయాలతో పాటు విమాన శిక్షణ సంస్థలు (ఎఫ్‌టీఓలు) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు సీప్లేన్ సేవలు ప్రారంభించే అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం సూచించారు. దీనిపై అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులను తరచూ కలిసి పెండింగ్ అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణ ప్రభుత్వం వేగంగా భూసేకరణ పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. వరంగల్ విమానాశ్రయం కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.


















