సందర్బం, జూలై 04: తన 20 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగ సందేశం విడుదల చేశారు. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం తనకు ఎప్పటికీ మరపురాని మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు.
“మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా ప్రారంభమైన నా ప్రయాణం, నేడు మీ అందరి గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే స్థాయికి చేరడం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం” అని ఆయన అన్నారు.
ప్రజల కోసం సాగించిన ప్రతి పోరాటంలో తన వెంట నడిచిన ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ఆశీర్వాదాలే తనకు బలమని పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా, అన్నింటికంటే “రేవంతన్న”గా ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటానని హామీ ఇచ్చారు.




















