Trending Now

కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో గెలిచింది : కేటీఆర్

ఈనెల 6న రాష్ట్ర వ్యాప్త నిరసన..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎల్​ఆర్​ఎస్​ పేరుతో ప్రజల నుంచి సుమారు రూ.20 వేల కోట్ల దోపిడీ చేసేందుకు కాంగ్రెస్​ప్రభుత్వం యత్నిస్తున్నదని, దీన్ని వెంటనే ఆపాలంటూ ఈనెల 6న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎల్​ఆర్​ఎస్​ వద్దని, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పి, నేడు కాంగ్రెస్​పార్టీ మాట తప్పిందని ఆరోపించారు. అప్పుడు ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ మాట్లాడిన రేవంత్, భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియోను కేటీఆర్​ మీడియా ముందు ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీలు, మున్సిపాలిటీలన్ని కలిపి ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది పైన కనీసం లక్ష రూపాయల భారం పడనుందన్నారు.

ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తో సహా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు, ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ సాక్షాలతో సహా మీడియా ముందు ఉంచారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

అప్పటి సీఎల్పీ నేత ఇప్పటి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఎవరు ప్రభుత్వానికి డబ్బులు కట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి డబ్బులను దోచుకోవడానికే ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తున్నారని కెటిఅర్ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేయడం జరుగుతుందని, మరీ ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా అన్నారు.

ఒక ఒకప్పుడు ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’ అన్న ఉత్తంకుమార్ రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అప్పుడు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని తెలిపిన ఉత్తంకుమార్ రెడ్డి, ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు లాక్కోవడం పైన స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే ఎల్ఆర్ఎస్ అంశం పైన మంత్రి సీతక్క మాట్లాడుతూ డబ్బులు దోచుకోవడానికే ఎఆర్ఎస్ పెట్టారని మాట్లాడింది, మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమం పైన కోర్టులో కేసు వేసిన మరో మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ఆ కేసును వెనక్కి తీసుకున్నారా లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరోసారి ఎల్ఆర్ఎస్ వద్దు అంటూ కేసు వేస్తారా అనే విషయాన్ని తెలియజేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అడ్డగోలు హామీలతో గెలిచిన కాంగ్రెస్​..

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలన్నింటిని తూ.చా తప్పకుండా అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల పైన కనీసం లక్ష రూపాయల చొప్పున భారాన్ని మోపేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా 20వేల కోట్ల రూపాయలను దోచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.

అధికారంలో లేనప్పుడు ఒక తీరుగా అధికారంలో ఉన్నప్పుడు మరొక తీరుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రుల వైఖరి పైన కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేలా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేసేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల ఆరవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిరసన కార్యక్రమాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరుతూ ప్రతి జిల్లా కలెక్టర్ కి, అర్డీవోలకు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా అందిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ) కార్యాలయం ముందు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) కార్యాలయం ముందు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

Spread the love