Trending Now

‘ఫిత్రా’.. పరమార్థం

పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక ఆరాధనల్లో ‘ఫిత్రా” ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ అంటే శాబ్దిక అర్ధం ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్ధం. ధర్మ శాస్త్ర పరిభాషలో ‘’సదఖయే ఫిత్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట. రోజాలు విధిగా నిర్ణయించిన నాటి నుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆదేశించారు.

ఆ కాలంలో ప్రజలు ముఖ్య ఆహారంగా వినియోగించే పదార్ధాలనే పరిగణనలోకి తీసుకొని ఫిత్రాలు చెల్లించేవారు. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ(ర) ఇలా చెప్పారు: “ప్రవక్త వారి కాలంలో మేము ఈదుల్ ఫిత్ (పండుగ) దానంగా ఒక ‘సా’ పరిమాణమంత పదార్ధాలను ఇచ్చే వాళ్ళం. ఆ కాలంలో యవలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, జున్ను తదితరాలు ముఖ్య ఆహార పదార్థాలుగా ఉండేవి.”

‘సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు..

మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో అయినా ఫిత్రాలు చెల్లించవచ్చు. ఫిత్రాల వల్ల రెండు రకాల లాభాలున్నాయి. ఒకటి రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారంగా ఈ ఫిత్రాలు ఉపయోగపడతాయి. వీటి వల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకార భాగ్యానికి నోచుకుంటాయి.

రెండు- ఫిత్రాల వల్ల సమాజంలోని పేద, బలహీన వర్గాలకు కాస్తంత ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈ కారణంగానే ప్రవక్త మహనీయులు ఫిత్రా దానాన్ని ‘తూమతుల్లిల్ మసాకీన్’ అన్నారు. అంటే ‘దీనులు, నిరుపేదల భృతి’ అని అర్ధం.

అందుకే ప్రవక్త మహనీయులు ఫిత్రా దానాలను ఉపవాసులకే పరిమితం చేయకుండా, ఈ పరిధిని విస్తరించారు. అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలి. కుటుంబంలో ఎంత మంది ఉంటే, వారందరి తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజు కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నేరవేర్చుకోవాలి. కనీసం ఒక వారమో, మూడు నాలుగు రోజుల ముందో చెల్లిస్తే లబ్దిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే గదా అసలు ఉద్దేశ్యం. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు.

కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్ని రకాల ఆరాధనలు ఆచరిస్తూ, ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర నెలలో ఏదో ఒక రకంగా, ఎంతోకొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహా భాగ్యం ఇంకేముంటుంది. అల్లాహ్ అందరికీ రమజాన్ మాసాన్ని సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.

ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్..

మజ్లిస్ తహఫుజ్ ఖత్మె నబువ్వత్ రిలీజియస్ ట్రస్టు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు..

హిర ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ.. ప్రిన్సిపాల్ మదర్సా అరబియా హిప్జుల్ ఖురాన్, రేకుర్తి కరీంనగర్

Spread the love

Related News