- సొంత యుపిఐ పేమెంట్లతో చైతన్య పాఠశాలను నిండా ముంచుతున్న అకౌంటెంట్
- ఎంఈఓ ఆకస్మిక తనిఖీ
- ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేసిన ఎంఈఓ
ప్రతిపక్షం, వికారాబాద్ జూలై 2: తాండూరు పట్టణ కేంద్రంలోని పాత కుంటలో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాల అమ్మకానికి తెరలేపింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాల అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి తన పర్సనల్ అకౌంట్ లోకి యూపీఐ పేమెంట్ చేయించుకుంటూ రెట్టింపు ధరలకు పుస్తకాలను పాఠశాల తల్లిదండ్రులకు విక్రయిస్తున్నారు. డోర్ డెలివరీ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్తూ రాత్రి 7, 8 గంటల ప్రాంతంలో ఇంటింటికి పుస్తకాలు చేరవేసే కార్యక్రమాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. గురువారం పుస్తకాల కోసం అధిక డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ ని ఈ విషయాన్ని అడగడానికి వెళ్ళగా పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ జాఫర్ తనకు ఏమీ తెలియదని, పుస్తకాలు పాఠశాలలో అమ్మటం లేదని, డోర్ డెలివరీ చేస్తున్నారని చెప్పారు. తాను పాఠశాలలో ఉద్యోగంలో చేరి ఒక్క నెల మాత్రమే అయిందని తనకు పాఠశాల వ్యవహారాలు ఏమీ తెలియదని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ప్రజా సంఘ నాయకులు తల్లిదండ్రులతో కలిసి పుస్తకాల విక్రయంపై పాఠశాల ప్రిన్సిపాల్ ని అడగగా తనకు ఈ విషయం తెలియదని, డోర్ డెలివరీ చేస్తున్నట్లు మాత్రమే తనకు తెలుసని, గత సంవత్సరం పుస్తకాల విక్రయాన్ని బుక్ డిపో కి అప్పగించిన సందర్భంలో ఐదు ఆరు లక్షల నష్టం రావడంతో ఈ సంవత్సరం ఏ బుక్ డిపోకు కూడా పుస్తకాల విక్రయాన్ని ఇవ్వలేదని వివరణ ఇచ్చారు. అంతలో ప్రిన్సిపాల్ ప్రజా సంఘాల డిమాండ్ తో అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో తాను ఉద్యోగం మాని వేస్తున్నానని, తనకి పుస్తకాల అమ్మకానికి ఎలాంటి సంబంధం లేదని, తాను పాఠశాలకు రానని చెప్పాడని ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. ఎంఈఓ ఇందుప్రియ పాఠశాలను తనిఖీ చేయగా పుస్తకాల విక్రీయం జరుగుతున్నట్లు ప్రిన్సిపల్ ఒప్పుకోవడంతో ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేయించారు. తాండూరులో మరెన్నో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు తీసుకుంటూ, పుస్తకాలను సొంతంగా విక్రయించుకుంటూ, 25% అల్ప సంఖ్యాక విద్యార్థులకు సీట్లు ఇవ్వాలనే నిబంధనలను తుంగలో తొక్కి విద్యాసంస్థలను నడిపించుకుంటున్నాయని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలపై చర్యలు తీసుకునే దిశగా తాము ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నాలుగవ తరగతి విద్యార్థికి విద్యాస్థలి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తరపున రూ.3450 , శ్రీ నలంద ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రూ.5610 వసూలు చేశారంటూ నాలుగో తరగతి విద్యార్థి నిహాల్ ఖాన్ తండ్రి ఆరోపించారు. మరోవైపు ఒకటవ తరగతి విద్యార్థినికి విద్యాస్థలి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తరపున రూ.2990 , శ్రీ నలంద ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రూ.3485 వసూలు చేశారంటూ ఒకటవ తరగతి విద్యార్థిని వర్షిని తండ్రి శ్రీనివాస్ ఆరోపించడమే కాకుండా పాఠశాల అకౌంటెంట్ బాలవర్ధన్ రెడ్డి తన వ్యక్తిగత ఫోన్ పే నెంబర్ కు రూ.6500 వేయించుకున్నారన్నారు. ఒకే పాఠశాలకు రెండు సొసైటీలను మైంటైన్ చేస్తూ, వ్యక్తిగత అకౌంట్లో డబ్బులు వేసుకుంటూ ఎమ్మార్పీల కంటే రెండింతల రేట్లకు పుస్తకాలను అమ్ముకుంటూ, రాత్రి వేళల్లో పుస్తకాలను డోర్ డెలివరీలు చేస్తూ అక్రమ ధనార్జనకు తెర తీశారన్నారు. ఈ విధమైన చర్యలు ప్రైవేటు పాఠశాలలు మానుకోవాలని లేనిచో పాఠశాల ముందు బయటాయించి నిరసన వ్యక్తం చేయడమే కాకుండా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

























