అంగవైకల్యం ఉన్న మనోధైర్యంతోనే ముందుకు..
ఓటు హక్కును వినియోగించుకున్న జాకీర్ పాష
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : ఓ వైపు జాతీయ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా తమదైన రీతిలో ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ పలు ఎన్నికలలో అధికారిక అంచనాలకు అనుగుణంగా పోలింగ్ జరగాక పోవడంతో అటు ఎలక్షన్ కమిషన్ ఇటు రాజకీయ పార్టీలు తీవ్ర మానసిక శోభకు గురవుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఓ అంగవైకల్యం గల నిరుద్యోగ యువకుడు తనదైన ప్రజాస్వామ్యం బాధ్యతను సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికలలో తన ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని నిర్వర్తించుకున్నాడు.
ఆదర్శం ఈ యువకుడు అంగవైకల్యం ఉన్న మనోధైర్యంతో ఉన్నతస్థాయి శిఖరాలను అధిరోహించాలన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. పుట్టుకతోనే ఆయనకు రెండు చేతులు లేకపోయినా ఉన్నత చదువులు చదివి తనదైన రీతిలో ముందుకు వెళుతున్నాడు. ఆసిఫాబాద్ (కొమురం భీం) జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణానికి చెందిన జాకీర్ పాష (27) సోమవారం ఉదయం అందరికంటే ముందు తన నిర్ణీత పోలింగ్ స్టేషన్‌కు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ప్రతి ఎన్నికలలో తను బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నానని తెలిపాడు. మహోన్నతమైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న సుసంపన్నమైన ప్రజాస్వామ్య దేశం మన దేశం అని చెప్పాడు. శాసన సభ, లోక్ సభ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఓటు వేయకుండా ఉండనని, తాను ఓటు బాధ్యతగా వెయ్యడమే కాకుండా తన కుటుంబ సభ్యులను బంధుమిత్రులను కూడా ఓటు కోసం గల విలువను వివరిస్తానని చెప్పాడు. తను పీజీ చదివి కంప్యూటర్ కోర్సులలో తగిన వైజ్ఞానిక పరమైన నైపుణ్యాన్ని సాధించానని తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అభిప్రాయపడ్డాడు.