“ఖబర్దార్ పవన్ కల్యాణ్.. తెలంగాణ జోలికి రావొద్దు”

  • తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించం
  • కాంగ్రెస్ పార్టీ కాంటెస్టడ్ ఎమ్మెల్యే అభ్యర్థి
  • తాడూరి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

సిద్దిపేట, ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, సిద్దిపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంటెస్టడ్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం సిద్దిపేటలో డీసీసీ కార్యదర్శి వంగరి నాగరాజుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది ఉద్యమకారులు పోరాడి, అమరులైన త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో మద్దతుగా ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ‘తెలంగాణ నవ నిర్మాణ సభ’ పేరుతో హైదరాబాద్‌లో సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాల పట్ల గౌరవం లేని వ్యక్తిగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.కొండగట్టు అంజన్న ఆలయానికి టీటీడీ నిధులతో చేసిన సహాయాన్ని తన వ్యక్తిగత విరాళంలా ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు అందిస్తారని, టీటీడీ నిధులు ప్రజలవేనని గుర్తు చేశారు.“తెలంగాణ బరాబర్ తెలంగాణ ప్రజల జాగీరు. మా తాతలు, తండ్రులు ఇక్కడే పుట్టి పెరిగారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించం. మా అభివృద్ధి మేమే చూసుకుంటాం. అనవసరంగా తెలంగాణ జోలికి రావద్దు” అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.పవన్ కల్యాణ్ వెనుక కొందరు రాజకీయ శక్తులు పనిచేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన ఆయన, సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.చివరగా గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు పవన్ కల్యాణ్‌కు లేదని, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని పేర్కొంటూ శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు.

Spread the love

Related News

Latest News