ప్రతిపక్షం, ఆగస్టు 05: అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా పలువురు మహిళలతో పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ఒక మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు, కేసుకు సంబంధించిన మరో ఐఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో తనకు వచ్చిన ప్రపోజల్స్‌కు అంగీకరించానని, తాను కూడా కొందరికి ప్రపోజ్ చేశానని, అందులో తప్పేముందని ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
డిజిటల్ పరికరాల్లోని డేటా, చాట్ హిస్టరీ, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పరిశీలిస్తున్న అధికారులు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

















