ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి రేవంత్‌రెడ్డి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన నాయకుడిగా వైఎస్సార్ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ సాగించిన ఆయన పాలనకు ప్రజల్లో ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉందన్నారు.
వైఎస్సార్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, పేదలు, రైతులు, విద్యార్థులు, బలహీన వర్గాల కోసం తీసుకున్న నిర్ణయాలు ఆయన పాలనకు ప్రత్యేక ముద్రను తీసుకొచ్చాయని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసిన ఆయన సేవలు ఎప్పటికీ స్మరణీయంగా ఉంటాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్ తదితరులు వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.





























