[t4b-ticker]

వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని వెయ్యి రోజులుగా నరకం: కేటీఆర్

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ఆయన ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లో రాష్ట్రాన్ని స్వర్గంలా మారుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందని, ఇప్పటికే రూ.4.50 లక్షల కోట్ల అప్పు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రిబ్బన్‌ కటింగ్‌లు చేయడం తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని కేటీఆర్‌ విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలనే తమవిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణను తాము అభివృద్ధి చేసి, సంక్షేమంతో ముందుకు తీసుకెళ్లామని కేటీఆర్‌ అన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచభక్ష పరమాన్నంతో కూడిన రాష్ట్రాన్ని అప్పగిస్తే.. కుక్కలు చించిన విస్తరాకులా మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఫల్యాలను గుర్తించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love

Related News

Latest News