[t4b-ticker]

బీపీ టాబ్లెట్ మానేస్తే ప్రమాదమే: వైద్యులు

ప్రతిపక్షం, సెప్టెంబర్ 02: రక్తపోటు సమస్య ఉన్నవారు మందులను సొంత నిర్ణయంతో ఆపేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు బీపీ టాబ్లెట్‌ వేసుకోకపోతే పెద్దగా ఏమీ కాదని చాలామంది భావిస్తుంటారని, కానీ ఇది సరైన ఆలోచన కాదని డాక్టర్‌ శ్రీకాంత్‌ మిర్యాల సూచించారు. వైద్యుల సలహా లేకుండా మందుల మోతాదును మార్చడం లేదా పూర్తిగా నిలిపివేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

బీపీ మందులు రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు పనిచేస్తాయని, ప్రతి మందు ప్రభావం దాని స్వభావాన్ని బట్టి నిర్దిష్ట కాలం ఉంటుందని డాక్టర్‌ శ్రీకాంత్‌ మిర్యాల పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి మందు తీసుకోకపోతే కొందరిలో రక్తపోటు అదుపుతప్పే అవకాశం ఉంటుందని వివరించారు.

ముఖ్యంగా రక్తపోటు సమస్య ఉన్నవారు తమకు తాము మందులు నిలిపివేయడం, మోతాదు తగ్గించడం లేదా పెంచడం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ సాధారణ స్థాయికి వచ్చిందని భావించి మందులను ఆపేయడం కూడా సరైన విధానం కాదని చెబుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉన్నప్పటికీ మందులను కొనసాగించాలా, మోతాదులో మార్పులు చేయాలా అనే విషయాన్ని వైద్యుడే నిర్ణయించాలని సూచిస్తున్నారు.

బీపీ మందులు క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు సమతుల ఆహారం, ఉప్పు వినియోగాన్ని నియంత్రించడం, శారీరక వ్యాయామం, తగిన నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల వైద్యుడు సూచించిన విధంగా మందులను నిర్ణీత సమయానికి తీసుకోవాలని, ఏదైనా కారణంతో ఒక మోతాదు మిస్‌ అయితే తదుపరి మోతాదు విషయంలో కూడా సొంతంగా నిర్ణయం తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. బీపీ మందులను ఎప్పుడు ఆపాలి, మోతాదును ఎప్పుడు మార్చాలి అనే నిర్ణయం వైద్యుల సలహాతోనే తీసుకోవాలని డాక్టర్‌ శ్రీకాంత్‌ మిర్యాల అవగాహన కల్పించారు.

Spread the love

Related News

Latest News