ప్రతిపక్షం, ఆగస్టు 06: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం మరోసారి లీకుల బారిన పడింది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతం నుంచి మహేశ్‌బాబు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అవుతుండటం చిత్రబృందానికి తలనొప్పిగా మారింది. తాజాగా బయటకు వచ్చిన మహేశ్‌బాబు విజువల్స్ కూడా నెట్టింట వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సినిమా కథ, కీలక సన్నివేశాల గోప్యత దెబ్బతింటుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. విజువల్ గ్రాండియర్, సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత గోప్యంగా చిత్రీకరిస్తున్నప్పటికీ, వరుస లీకులు కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇకపై చిత్రీకరణ జరిగే ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, షూటింగ్ స్పాట్‌లకు అనుమతి లేని వ్యక్తులను దూరంగా ఉంచాలని అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్‌ను కోరుతున్నారు.
మహేశ్‌బాబు–రాజమౌళి కలయికలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, లీకులకు చెక్ పెట్టేందుకు చిత్రబృందం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

















