Trending Now

మోదీ పేరు చెప్పి ఓట్లు అడగటం సిగ్గు చేటు

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్, మే 10: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంపీగా ఐదేళ్లు అనుభవం గడిచి కూడా ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ పేరు చెప్పి ఓట్ల అడగడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక గోనేరెడ్డి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఐదేళ్లు ఎంపీగా ప్రజలకు చేసింది ఏమిలేదు కాబట్టే మోదీ మొఖం చూసి ఓట్లు అడుగుతున్నాడని విమర్శించారు. అరవింద్ ఒక్కడు ఓడినా నరేంద్ర మోదీకి జరిగే నష్టం ఏమీలేదని, మాయ మాటలు, బుడ్డర్ఖాన్ వేశాలతో టైమ్ పాస్ చేసే బీజేపీ అభ్యర్థి వల్ల మరోసారి మనమే నష్టపోతామని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో డి. శ్రీనివాస్ మంత్రిగా ఉన్న హయంలో జిల్లాకు ఇసుమంతైన అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. డిఎస్ కుమారులు సంజయ్ మేయర్ గా, అరవింద్ ఎంపీగా ఉండి నిజామాబాద్ కు ఏమీ చేయని వ్యక్తులు కావాలా ప్రజల మనిషి బాజిరెడ్డి గోవర్ధన్ కావాలా ప్రజలు ఆలోచించి ఓటు వెయ్యాలని కోరారు. ఇక పట్ట భద్రుల ఓట్లతో ఎమ్మెల్సీ గా గెలిచి పత్తలేకుండా పోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. రైతులకు రూ. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా, కళ్యాణలక్ష్మి కింద ఆడ బిడ్డలకు తులం బంగారం హామీని తప్పినందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా, ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా అడిగిన అన్నార్తులను చెప్పుతో కొడతామని కండ కావరంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ మంత్రులను చూసి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ గెలిచిన వ్యక్తిని, జిల్లాలో సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిని కావున మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారాల కోసం కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో బీడీ కార్మికులు బాధపడుతున్నారన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ను పట్టు పట్టి బీడీ పెన్షన్ మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్సీ కవితదేనని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గారెంటీ అమల్లో వృద్దులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తానని మాయమాటలు చెప్పి మభ్య పెట్టడానికి వస్తున్న రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన చారిత్రక బాధ్యత మనపై ఉందన్నారు. వచ్చే 13న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, బీఆర్ ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు సిర్ప రాజ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పోరేటర్ ధర్మపురి, నాయకులు రవిచంద్ర, సత్య ప్రకాష్, సీనియర్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News