[t4b-ticker]

నటి ట్విషా శర్మ మృతి కేసు.. కీలక పరిణామం

ప్రతిపక్షం, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆమె భర్త సమర్థ్‌ సింగ్‌, అత్త గిరిబాల సింగ్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు సమాచారం. వరకట్నం కోసం ట్విషను వేధించారని, ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారని దర్యాప్తులో తేలినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

భర్త సమర్థ్‌ సింగ్‌, ఆయన తల్లి గిరిబాల సింగ్‌ కలిసి ట్విషను వివాహం తర్వాత వరకట్నం కోసం వేధించినట్లు సీబీఐ ఆరోపించింది. గిరిబాల సింగ్‌ గతంలో న్యాయమూర్తిగా పనిచేసినట్లు సమాచారం. కుటుంబంలో ఎదురైన వేధింపులు, ఒత్తిడి కారణంగానే ట్విష తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితికి వెళ్లినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

వివాహమైన ఐదు నెలలకే అనుమానాస్పద మృతి

ట్విషా శర్మకు సమర్థ్‌ సింగ్‌తో వివాహం జరిగి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మే 12న భోపాల్‌లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది.

ట్విష మృతి వెనుక కారణాలపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె భర్త సమర్థ్‌ సింగ్‌, అత్త గిరిబాల సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు సీబీఐకి అప్పగించగా.. అధికారులు వివిధ కోణాల్లో ఆధారాలను పరిశీలించారు.

వరకట్న వేధింపులే కారణమా?

దర్యాప్తులో భాగంగా ట్విషకు సంబంధించిన ఫోన్‌ వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సీబీఐ పరిశీలించినట్లు సమాచారం. ఈ ఆధారాల ఆధారంగానే వరకట్నం కోసం వేధింపులు జరిగినట్లు, ఆమెపై మానసిక ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ట్విషను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలను కూడా సీబీఐ నమోదు చేసింది. తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలుతో కేసు తదుపరి దశకు చేరుకుంది. కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ సమర్పించిన ఆధారాలు, ఆరోపణలపై న్యాయస్థానం పరిశీలన జరపనుంది.

కాగా, ఈ కేసులో భర్త, అత్తపై ఉన్న ఆరోపణలు కోర్టులో రుజువు కావాల్సి ఉంది. ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగనుంది.

Spread the love

Related News

Latest News