ప్రతిపక్షం, ఆగస్టు 04: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అవి తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.
దేవాలయాల సందర్శనను క్షుద్ర పూజలతో ముడిపెట్టి తప్పుడు ఆరోపణలు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పరువు నష్టం దావాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్ నేతలు ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

















