షాబాద్ హత్యలపై కవిత ఆగ్రహం.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్

ప్రతిపక్షం, జూలై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురు హత్యల ఘటనపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని కవిత వ్యాఖ్యానించారు. పోక్సో కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడమే కాకుండా, అనంతరం ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.

ఒకే ఘటనలో వరుసగా ఇన్ని హత్యలు జరుగుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకోలేకపోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆమె విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News