టీఆర్ఎస్ పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. కవిత వాదన విన్నాకే ఈసీ నిర్ణయం

ప్రతిపక్షం, జూలై 07: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుకు సంబంధించిన వివాదంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ పేరుపై కల్వకుంట్ల కవిత వాదనలు పూర్తిగా విన్న తర్వాతే ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో సహజ న్యాయ సూత్రాలను పాటించాలని కోర్టు సూచించింది.

తెలంగాణ రక్షణ సేన పేరిట పార్టీ నమోదు కోసం కవిత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా, బీఆర్ఎస్‌తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరును కేటాయించడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయంగా మరో మూడు పేర్లను సూచించాలని ఎన్నికల సంఘం ఇటీవల కవితకు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కవితకు తన వివరణను ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఆ వివరణను పరిశీలించి, కవిత వాదనలు విన్న అనంతరమే పార్టీ పేరుపై తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో టీఆర్ఎస్ పేరు కేటాయింపుపై తుది నిర్ణయం మరికొంతకాలం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Spread the love

Related News

Latest News