Trending Now

గులాబీ పార్టీలో గుబులు.. పార్టీని వీడుతున్న నేతలు

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత పదేళ్లుగా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన బీఆర్​ఎస్​ పార్టీకి గడ్డు పరిస్థితి దాపురించింది. పదేళ్ల అధికారంలో రాష్ట్రంలోని టీడీపీ పార్టీని భూస్థాపితం చేసి, కాంగ్రెస్​పార్టీలో వలసలకు ప్రేరేపించిన బీఆర్​ఎస్​పరిస్థితి నేడు కడు దయనీయంగా మారింది. అధికారం కోల్పోయి ముచ్చటగా వంద రోజుల్లో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు, మంత్రులుగా ఉన్న నేతలు నేడు కారు దిగి హస్తం వంచన చేరుతున్నారు. నీవు నేర్పిన విధ్య నీరజాక్షి అన్న చందంగా బీఆర్​ఎస్​ పార్టీ నుంచి కాంగ్రెస్​కు అలాగే బీజేపీలో చేరుతుండడంతో లోక్​సభ ఎన్నికల తర్వాత బీఆర్​ఎస్​ పార్టీ పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. గులాబి బాస్​ మాజీ సీఎం కేసీఆర్​ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీల ఉనికికే ప్రశ్నర్థంగా ఆ పార్టీలను చీల్చి…తమ పార్టీలో చేర్చుకున్నారు. నేడు అదే బాటన కాంగ్రెస్​పార్టీ నడుస్తోంది. తమ పార్టీని దెబ్బ కొట్టిన విధంగానే బీఆర్​ఎస్​ పార్టీని దెబ్బకొట్టాలన్న సంకల్పంతో సీఎం రేవంత్​రెడ్డి బీఆర్​ఎస్​ నేతలపై ఆకర్ష్​ మంత్రాన్ని వదలారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించడంతో గులాబి పార్టీలో వణుకుపుట్టింది. ఈనెల 19 తర్వాత బీఆర్​ఎస్​కు చెందిన 8మంది పెద్ద తలకాయలు కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్సీలు సైతం ఉన్నట్లు గాంధీభవన్​ వర్గాల భోగట్ట.

ఆస్తుల కాపాడేందుకే..

ప్రస్తుతం బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరిన నేతల్లో అధికంగా తమ ఆస్తులు కాపాడుకునేందుకే అధికార పార్టీలోకి జంప్​ అయ్యారంటూ గ్రామాల్లో కోడై కూస్తోంది. అధికారం కోల్పోయిన వెంటనే తమ ఆస్తులపై, తమ అక్రమ వ్యాపారాలు, భూ కబ్జాలపై రేవంత్​రెడ్డి ప్రభుత్వం కొరఢా జులిపిస్తుందన్న ఆందోళనతోనే వారు కాంగ్రెస్​పార్టీలో చేరినట్లు సోయల్​మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చేరిన కొందరు నేతలు ఇప్పటికే భూ కబ్జాలు, అక్రమార్జన అన్న పలు అంశాలపై ఆరోపణలున్న నేతలు కావడం గమనార్హం.

వీళ్లంత ప్రజలకు సేవ చేసేందుకే పార్టీ మారారా..?

అధికారం కోల్పోయిన అనంతరం భారత్ రాష్ట్ర సమితిని నేతలు పార్టీని వీడేందుకు ఇతర పార్టీల వద్ద క్యూకడుతున్నారు. . బీఆర్ఎస్‌లో అవకాశం రాదని నిర్ణయించుకొని పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇందులో సిట్టింగ్ ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అందులో కొందరికి ఇతర పార్టీల్లో లోక్‌సభ టికెట్లు కూడా దక్కాయి. మరికొందరు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఎంపీలు, మాజీలకే పరిమితమైన వలసల జాబితాలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చేరారు.భారత్ రాష్ట్ర సమితి శాసనసభ్యులు పార్టీని వీడతారాన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసినప్పుడల్లా ఈ ప్రచారం జోరందుకుంటోంది. అయితే సదరు ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపుర్వకంగా, అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. తాము పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అయితే రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారాన్ని నిజం చేస్తూ.. హస్తం పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో మొదటి ఎమ్మెల్యే గులాబీ పార్టీని వీడినట్లైంది. గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్న పరిణామాలు : ఎమ్మెల్యేలు కలిసినపుడు తనకు అన్ని విషయాలు చెబుతున్నారని ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తే తాము అండగా ఉంటామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు. మరుసటి రోజే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలన్నీ గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Spread the love