ప్రతిపక్షం, జూలై 07: బీసీలకు జనాభా ప్రాతిపదికన 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్టు 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ఈ సభకు ‘సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ’ అనే పేరు నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని భౌగోళిక తెలంగాణ సాధించిన తర్వాత సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని కవిత పేర్కొన్నారు. అదే లక్ష్యంతో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని చెప్పారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే సభ ప్రధాన ఉద్దేశమని వివరించారు.
తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ గత రెండేళ్లుగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతర ఉద్యమం చేస్తున్నాయని కవిత గుర్తుచేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను దేశవ్యాప్త ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ సభ కీలక వేదికగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
తమిళనాడులో ఎంజీఆర్ ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినట్లే, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి కూడా హైదరాబాద్ సభ దిక్సూచిగా మారుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ఆగస్టు 6న జరిగే సభ దేశ రాజకీయాల దిశను మార్చే స్థాయిలో ప్రభావం చూపుతుందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ, శాసన మండలిలో ఆమోదించి కేంద్రానికి పంపిందని కవిత గుర్తుచేశారు. అయితే ఆ బిల్లులకు కేంద్ర ఆమోదం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదని విమర్శించారు.
“మనమెంతో.. మనకంత” అనే నినాదాన్ని సాకారం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కవిత పిలుపునిచ్చారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



















