ప్రతిపక్షం, జూన్ 08: హైదరాబాద్ నాంపల్లి ప్రదర్శన ప్రాంగణంలో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమం సందర్భంగా భద్రతా, వైద్య, రవాణా ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో క్యూలైన్లు, పంపిణీ కేంద్రాలు, నియంత్రణ కేంద్రం పనితీరును అధికారులు సమీక్షించారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు ప్రాంగణానికి చేరుకోవడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.
భక్తుల సౌకర్యార్థం మూడు వైద్య శిబిరాలు, ఐదు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. అస్వస్థతకు గురైన వారికి తక్షణ చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు విధుల్లో ఉండనున్నాయి. అవసరమైతే ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేశారు.
అగ్నిప్రమాదాల నివారణ కోసం మూడు అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచగా, తాగునీరు, విశ్రాంతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. ఈసారి లక్షకు పైగా చేప పిల్లలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం రాత్రి శుభ ముహూర్తాన చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై మరుసటి రోజు వరకు కొనసాగనుంది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కూడా అమలు చేస్తున్నారు.
















