ప్రతిపక్షం, జూలై 19: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ తనకు కేవలం ఉద్యమకారుడు మాత్రమే కాదని, ఆత్మబంధువని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్‌కేసర్‌లో ఆయన స్మృతి వన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అందెశ్రీ కవిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా పరిచయమై ఉండొచ్చని.. కానీ తనకు మాత్రం ఆయన ఆత్మబంధువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందెశ్రీ గానంలోని గొప్పతనం, ఆయన గళంలోని ఉద్యమ స్ఫూర్తి తనలోనూ చైతన్యం నింపిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగడంలో అందెశ్రీ స్ఫూర్తి కూడా ఉందని తెలిపారు.
తాను ఏడుగురు అన్నదమ్ముల్లో నాలుగోవాడినని, తన పెద్దన్న తనకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలిచారని సీఎం చెప్పారు. ఎదుగుతున్న సమయంలో తన పెద్దన్నను కోల్పోయిన తర్వాత తనకు మరో పెద్దన్నగా అందెశ్రీ కనిపించారని, ఆయనతో తన అనుబంధం కుటుంబ బంధంగా మారిందని గుర్తుచేశారు.
తెలంగాణ గడ్డపై ఆధిపత్యం చెలాయించాలని, ఈ ప్రాంతాన్ని ఆక్రమించి దోచుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అందెశ్రీ వంటి ఉద్యమకారులు మళ్లీ పుడతారని సీఎం హెచ్చరించారు. అందెశ్రీ స్ఫూర్తి ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని, ప్రజా ప్రభుత్వానికి ఆయన స్ఫూర్తే శ్రీరామరక్ష అని అన్నారు. అందెశ్రీ, గద్దర్ వంటి మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.
అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ వంటి పాటలు కేవలం గేయాలు కాదని సీఎం అన్నారు. అవి ప్రజల్లో చైతన్యం రగిలించిన తూటాల్లా, ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కూల్చిన మహా ఫిరంగుల్లా పనిచేశాయని కొనియాడారు. తన పదాలతో తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, ప్రతి బిడ్డను ఉద్యమం వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి అందెశ్రీ అని స్మరించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను, గొంతులను అంకితం చేసిన తొమ్మిది మంది ఉద్యమకారులను గుర్తించి, పార్టీలు, జెండాలకు అతీతంగా ప్రతి కుటుంబాన్ని సత్కరించి రూ.కోటి చొప్పున అందజేశామని సీఎం తెలిపారు. అది తన వ్యక్తిగత సొమ్ము కాదని, ప్రజల సొమ్ము అని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భాన్ని కూడా సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో అందెశ్రీ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల సమక్షంలో సీఎం పుష్పాంజలి ఘటించి స్మృతి వన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.




















