ప్రతిపక్షం, జూలై 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు ఓటరు జాబితాల్లో నమోదవడం సాంకేతిక పొరపాటు మాత్రమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పుడు ఓటరు వివరాలు సకాలంలో నవీకరించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపింది.
తమ ఓటును కొడంగల్ నియోజకవర్గంలోనే కొనసాగించాలని, కొండారెడ్డిపల్లి ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలని సీఎం కుటుంబ సభ్యులు కోరినట్లు ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఈ లోపాన్ని సరిచేస్తున్నామని, ఓటరు జాబితాలోని తప్పులను సవరించడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

















