2029లో 117 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం.. భద్రాద్రి రాముడిపై ఆన: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 11: రాబోయే 2029 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని, ప్రజల మద్దతుతో భారీ మెజారిటీ సాధిస్తామని అన్నారు.

2029 మే లేదా జూన్ నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్న సీఎం.. రాష్ట్ర పునర్విభజన, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 182కు, అలాగే 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

పెరిగిన 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం.. “భద్రాద్రి శ్రీరాముడిపై ఆన.. ఇది ఖమ్మం ప్రజల మాట” అంటూ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సీఎం తీవ్ర విమర్శలు చేశారు. “కేసీఆర్ కాచుకో.. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ.. మీ కుటుంబంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీకి రావచ్చు. ప్రజలు సరైన తీర్పు ఇస్తారు” అంటూ సవాల్ విసిరారు.

రైతు సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమని పేర్కొన్న సీఎం.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేస్తాయని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News