ప్రతిపక్షం, జూన్ 10: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ ఫిర్యాదును సాకుగా చూపించి ఉద్దేశపూర్వకంగానే నామినేషన్ను తిరస్కరించారని ఆరోపించారు.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. నిబంధనల ప్రకారం అవసరం లేని అంశాలను కారణంగా చూపించి అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఒక రాజ్యసభ స్థానం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పరిణామాలకు తెరలేపారని చామల ఆరోపించారు. రెండు స్థానాలు గెలిచే అవకాశమున్నప్పటికీ మూడో అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సమయంలో వాటిని రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు దేశానికి మంచివి కావని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని వేదికలపై తమ వాదన వినిపిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత ఉండాల్సిన అవసరాన్ని మరోసారి ఆయన గుర్తు చేశారు.
















