ప్రతిపక్షం, జూలై 21: తెలంగాణలోని అన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో ఆగస్టు 30లోగా తనిఖీలు పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ అధికారి వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, కనీసం ఆరు గురుకులాలను పరిశీలించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షిత వాతావరణం కల్పించాలని మంత్రి స్పష్టం చేశారు. సొంత భవనాలు లేని గురుకులాలకు భూముల సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టి, ఆహార కలుషిత ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి గురుకులంలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి నెల కనీసం 15 గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

















