తెలంగాణలో సన్నబియ్యం ధరలకు రెక్కలు.. రెండు నెలల్లో కిలోపై రూ.12 వరకు పెరుగుదల

ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణలో సన్నబియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత రెండున్నర నెలల వ్యవధిలోనే కిలో సన్నబియ్యం ధర రూ.10 నుంచి రూ.12 వరకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా సోనా మసూరి, బీపీటీ, ఐఆర్-64 వంటి రకాల బియ్యానికి డిమాండ్ పెరగడంతో వాటి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ రకాల వరి క్వింటాల్ ధరలు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో కూడా బియ్యం ధరలు గణనీయంగా పెరిగి మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.

వ్యవసాయ రంగ నిపుణుల అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వరిసాగు తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో కొరత ఏర్పడుతుందనే అంచనాలతో కొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద మొత్తంలో బియ్యాన్ని నిల్వ ఉంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్‌లో సరఫరా తగ్గి ధరలు మరింత పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, మార్కెట్ పరిస్థితులను ప్రభుత్వం పర్యవేక్షించి అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో వర్షపాతం, వరి సాగు పరిస్థితులను బట్టి బియ్యం ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Spread the love

Related News

Latest News