గాంధీ సరోవర్‌కు గ్రీన్ సిగ్నల్.. మూసీ పునరుజ్జీవనానికి కీలక ముందడుగు

ప్రతిపక్షం, జూన్ 19: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు భారత సైన్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి రావడం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దృక్పథం అమలులో కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, ప్రజలకు నాణ్యమైన వినోద వనరుల కల్పన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. గాంధీ సరోవర్ నిర్మాణం పూర్తయితే మూసీ పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా కొత్త ఊపిరి పీల్చుకోనుందని అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. నగర సౌందర్యాన్ని పెంపొందించడంతో పాటు పర్యాటక రంగానికి కూడా ఇది కొత్త అవకాశాలను తీసుకురానుందని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మూసీ నది తీర ప్రాంతం హైదరాబాద్ నగరంలో మరో ప్రధాన ఆకర్షణగా మారుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Spread the love

Related News

Latest News