ఉన్నోళ్లంతా బీజేపీ, కాంగ్రెస్‌లోకి..
బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదు.. ఏ పార్టీలో చేరేదో స్పష్టత లేదు..
గందరగోళంలో ఐకేఆర్ అభిమాన వర్గం
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 22 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 35 సంవత్సరాలుగా తనదైన శైలిలో రాజకీయ చక్రం తిప్పి.. ఎందరికో రాజకీయ జీవితమిచ్చి రాజకీయ గురువుగా నిలిచిన ఆ రాజా నీతిజ్ఞుడు.. ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకొని అగమ్య గోచరమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటూ స్తబ్దంగా ఉండి పోతున్నాడు..! అయినా ఎంతగానో అభిమానించే వారందరూ భవిష్యత్తు రాజకీయ ప్రకటన కోసం అనుక్షణం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఆందోళన చెందుతున్నారు. వీరంతా నా మనుషులే.. వీరు ఎప్పుడు నాకు అస్సలుకే మోసం చేయారన్నా ప్రగాఢ విశ్వాసంతో నమ్ముకొని వారంతా ఊహించని రీతిలో వారికి పదవులు ఇచ్చారు పార్టీలో పెత్తనం ఇచ్చారు అయిన వారంతా వచ్చిన రాజకీయ సమీకరణాల సుడిగాలికి ఒకరూ ఒకరై అందరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లిపోయారు. ఆ పెద్దాయనే కాదు.. నిర్మల్ ప్రజలు ఎవరూ కూడా అసలు ఇలా జరుగుతదా అని ఊహించుకోలేదు. కానీ అందరూ అనుకుంటుండగానే.. చూస్తుండగానే అంతా అయిపోతునే ఉంది. ఇంత అవుతున్న ఆ పెద్దాయన మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయన ఎవరో కాదు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు “అన్న” అనే పదంతో పలకరించే మాజీ మంత్రి అల్లోల సుమారు 3 బీఆర్ఎస్ కార్యక్రమాలకు బీఆర్ఎస్ వారికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. లోకసభ ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి సమావేశాలకు కూడా డుమ్మా కొట్టారు. అల్లోల పార్టీ మారుతున్నారని రెండున్నర నెలలుగా జోరైన ప్రచారాలు.. పుకార్లు కొనసాగుతున్న ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ కి కూడా రాజీనామా చేయలేదు. కాంగ్రెస్లో చేరుతున్నారని బలమైన పుకార్లు రావడంతో కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున అల్లోల చేరిక ను వ్యతిరేకిస్తూ వార్డులు, గ్రామాలు ,మండలాల వారిగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
అప్రమతమైన కాంగ్రెస్ అధిష్టానం అల్లోల రాకను వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్ర జాతీయ స్థాయి స్థానం అల్లోలను ఎలాగైనా చేసి కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నుండి మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు. వారం రోజుల క్రితం నిర్మల్ లో అల్లోల తన అభిమానులతో రహస్య సమావేశం నుంచి సుమారు గంటన్నర పాటు అందరి అభిప్రాయాలను సేకరించగా మెజార్టీ మంది మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్తే బాగుంటుంది అని స్పష్టతకు వచ్చినట్లు పుకార్లు లేచాయి.
అది జరిగిన రెండు రోజుల నుంచే ఆ సమావేశంలో ఉన్న చాలామంది అయితే రెడ్డి అభిమానులు కూడా నేరుగా ఆయనను వీడి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు సమీక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం మరింత చర్చాంశానీయంగా మారింది. అల్లోల అంటే ఎంతగానో విశ్వాసంతో.. నమ్మకంతో ఉండే సోన్, దిలావర్ పూర్, సారంగాపూర్, లక్ష్మణ్ చాంద, నిర్మల్ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖ బీఆర్ఎస్ రాష్ట్ర,జిల్లా, మండల పట్టణ స్థాయి ప్రజాప్రతినిలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఆయా విభాగాల పదాధికారులు ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నేరుగా కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయారు. ఇప్పటికే అల్లోలతో ఎన్నో ఏళ్లుగా కలిసి ఉన్న అత్యంత సన్నిహితులు కూడా పార్టీలు మారడం నిర్మల్ లో పలు అనుమానాలను కలుగజేస్తుంది.
బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు.. ఏ పార్టీలో చేరేదో స్పష్టత లేదు..! రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్‌ఎస్ సంస్థగత సమావేశాలకు, దూరంగానే ఉంటున్న రాజీనామా చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కు చేరేందుకు ఉత్సాహంగా ఉన్న అల్లోలకు స్థానికంగా చేరికను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు, నిరసనలు మరింత మానసిక శోభకు గురి చేసినట్లు తెలుస్తుంది. నా వద్ద ఉన్న వాళ్లంతా నా వాల్లే అని సంఖ్య ను చూసి మురిసిపోయిన అల్లోల కు చెప్పాపెట్టకుండా వాళ్లంతా ఒక్కొక్కరుగా బీజేపీ కాంగ్రెస్‌లో చేరుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. చేరుతున్న వారందరిదీ ఒకటే మాట బీఆర్ఎస్ కు రాజీనామా చేయడూ.. చేరేది ఏ పార్టీలోనా చెప్పడని..! అందుకే ఎవరి దారి వారు చూసుకుంటూ అల్లోలకు దూరం అవుతున్నారు. అల్లోలను ఎంతగానో గౌరవించే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు సైతం ఆయనతో స్వయంగా మాట్లాడినందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు.. వారి ఆ ప్రయత్నాలకు ఈ మధ్య అల్లోల నుంచి సానుకూలత లభించినట్లు విశ్వాసనీయ సమాచారం.
చివరికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉండేందుకు కూడా తనను ఎంతగానో నమ్ముకొని తనతోనే ఉన్న ఆ కొద్దిపాటి మందితో చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకసభ నామినేషన్ ల పర్వం కూడా మొదలైంది. ఎన్నికల ప్రచారాలు జిల్లాలో జోరు అందుకుంటున్నాయి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా సోమవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉంది. అయినా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన నిర్ణయం, ప్రకటనపై గందరగోళమే నెలుకొని ఉండడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.