Trending Now

రక్తం దందాపై సర్కారు సీరియస్..​

నిబంధనలు పాటించని రక్త నిధి కేంద్రాల లైసెన్స్​ రద్దు..

సేకరించిన రక్తంలో 30శాతం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ఇవ్వాలన్న నిబంధన

నిబంధనలకు విరుద్దంగా సేకరణ, అమ్మకాలు..

9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు జారీ..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రక్తం దందాపై తెలంగాణ సర్కారు సీరియస్ గా తీసుకుంది. గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్దంగా రక్తం సేకరణ, విక్రయాలు జరుపుతున్న రక్తం నిధి కేంద్రాలు (బ్లడ్​ బ్యాంకుల)పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా రక్తం సేకరణ, విక్రయాలు నెరపడంతో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడంపై కూడా ప్రభుత్వం సీరియస్​గా తీసుకుఒంది. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంకుల దందాపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ మేరకు డ్రగ్​ కంటోల్​అధికారులు తాజాగా పలు బ్లడ్‌ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న దందాపై డ్రగ్ కంట్రోల్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్లడ్​ బ్యాంకులను తనిఖీలు చేయాలని నిర్ణయించారు.. మలక్‌పేట, చైతన్యపురి, లక్డీకపూల్‌, హిమాయాత్‌ నగర్‌, సికింద్రాబాద్‌, కోఠి, మెహదీపట్నం, బాలానగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం పరికరాలను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు. 9బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటిసులు డ్రగ్ కంట్రోల్ అధికారులు జారీచేశారు.

ఈనెల 2న మూసాపేటలోని హీమో సర్వీస్ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించారు డ్రగ్ కంట్రోల్‌ బ్యూరో అధికారులు. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు ఆర్‌ రాఘవేంద్రనాయక్‌ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. న్యూలైఫ్‌ బ్లడ్‌ బ్యాంకుల నుంచి బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు, దారుషిఫాలోని న్యూలైఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు పలు కార్యక్రమాల ద్వారా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్‌ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉంది. కానీ హైదరాబాద్ లోని పలు బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్‌ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ దానిని బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అయితే సేకరించిన రక్తంలో ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు రావడంతో అధికారులు బ్లడ్ బ్యాంకులపై దాడులు చేశారు.

Spread the love