Trending Now

తెలంగాణ‌ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. 15 నుంచి ఒంటిపూట బడులు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలు ఒంటిపూట బడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి ఆరంభం నుంచే భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. సామాన్యులు బయట అడుగు పెట్టాలంటే హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మార్చి15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల వేళలు నిర్ణయించింది.

మార్చి 15 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథాతథంగా ఉదయం పూటే తరగతులు నడుస్తాయని వివరించింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 24వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Spread the love