హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 10: తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయానికి నేడు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించబోతున్న “భారత్ ఫ్యూచర్ సిటీ” కల సాకార దిశగా తొలి అడుగు పడుతోందని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం ఈ మేరకు స్పందించారు.
ఆధునిక భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల కేంద్రంగా నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు.
సాయంత్రం 5.30 గంటలకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో భవిష్యత్ నగర నిర్మాణ ప్రణాళికలు, ప్రభుత్వ విజన్‌పై ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు.
కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఎఫ్‌సీడీఏ భవనాన్ని పూర్తి చేయడం విశేషమని అధికారులు తెలిపారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కార్యాలయం పర్యావరణ హిత నిర్మాణానికి ఆదర్శంగా నిలిచింది. ప్రారంభానికి ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి “నెట్ జీరో భవనం” గుర్తింపు పొందడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను చాటుతోంది.
పర్యావరణ పరిరక్షణ, శక్తి పొదుపు, ఆధునిక నిర్మాణ సాంకేతికతలను సమన్వయం చేస్తూ నిర్మించిన ఈ భవనం భవిష్యత్ నగరాల రూపకల్పనకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నగరాభివృద్ధి, పరిశ్రమలు, సాంకేతిక రంగాలు, నివాస ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల సరసన తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ఈ మహత్తర ప్రణాళిక ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, హరిత నిర్మాణాలు, సుస్థిర జీవన విధానాల సమ్మేళనంగా ఫ్యూచర్ సిటీ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణను భవిష్యత్ భారత అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఫ్యూచర్ సిటీ కీలక మైలురాయిగా నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి సృష్టికి, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు కొత్త అవకాశాలను తెరవనుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
















