- సహాయం మరచిపోని యువకుడు.. ఉద్వేగానికి గురైన హరీశ్ రావు
- మొదటి ఆరు నెలల జీతం ప్రజాసేవకు
- యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్ అరుదైన నిర్ణయం
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, జూలై 11: ఈ రోజుల్లో సహాయం పొందిన తర్వాత దానిని మరచిపోవడం సహజంగా మారుతున్న తరుణంలో, తన జీవితాన్ని మార్చిన ఒక చిన్న సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుని కృతజ్ఞతను చాటుకున్న ఓ యువకుడి ఉదారత అందరినీ కదిలించింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చేసిన సహాయానికి ప్రతిఫలంగా తన మొదటి ఆరు నెలల జీతం మొత్తం రూ.6 లక్షలను హరీశ్ రావు చేసే ప్రజాసేవ కార్యక్రమాలకు విరాళంగా అందించి సిద్దిపేటకు చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్ ఆదర్శంగా నిలిచాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్ గతంలో వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ సీటు కోసం హరీష్ రావును ఆశ్రయించాడు. ఆయన చొరవతో ఇంజినీరింగ్ సీటు లభించడంతో రోహిత్ తన చదువును విజయవంతంగా పూర్తి చేశాడు. తదనంతరం అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ రిగల్ రెక్స్‌నార్డ్ లో వార్షిక వేతనం రూ.12 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత తన జీవితంలో మలుపు తిప్పిన ఆ సహాయాన్ని మరచిపోలేదు. మొదటి సంవత్సర వేతనంలో సగం అయిన రూ.6 లక్షలను హరీశ్ రావుకు అందజేశాడు.శనివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, “ఈ డబ్బు వ్యక్తిగతంగా మీ కోసం కాదు… మీరు చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలకు నా వంతు ఉడతా సాయంగా వినియోగించండి. నాకు లభించిన అవకాశానికి ఇదే నా కృతజ్ఞత” అని పేర్కొన్నాడు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం హరీశ్ రావును భావోద్వేగానికి గురిచేసింది. “సహాయం చేసిన వారిని గుర్తుంచుకుని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఎంతో గొప్పది. రోహిత్ నేటి యువతకు స్ఫూర్తి. ఇలాంటి యువకులు సమాజానికి ఆదర్శం” అని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా రోహిత్‌ను హరీష్ రావు శాలువాతో సన్మానించి అభినందించారు. కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన రోహిత్ నిర్ణయం అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఇది కేవలం విరాళం కాదు… ఒక సహాయానికి హృదయపూర్వకంగా చెల్లించిన కృతజ్ఞత అని పలువురు అభిప్రాయపడ్డారు.




















