ప్రతిపక్షం, జూలై 08: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపుల సమస్యను ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం ‘బతుకు జట్కా బండి’ ద్వారా పరిష్కరిస్తామని నమ్మబలికి ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాధితురాలు కార్యక్రమం కార్యాలయాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వచ్చింది. పంజాగుట్టలో కార్యాలయం దొరకక సికింద్రాబాద్‌కు చేరుకున్న ఆమెకు ఇద్దరు వ్యక్తులు సహాయం చేస్తామని నమ్మించారు.
అనంతరం ఆమెను రాణిగంజ్‌లోని ఓ వాణిజ్య సముదాయానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మహిళలను మోసపూరితంగా నమ్మించి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
















