ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, జూలై 2: పరిశ్రమల స్థాపనతో పాటు పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీజీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్‌లో నిర్వహించిన “నీటి భద్రత – పారిశ్రామిక స్థిరత్వం” ఉన్నత స్థాయి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… నీటి భద్రత లేకుండా శాశ్వత పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్రతి పారిశ్రామిక పార్కులో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో పాటు అధునాతన మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను స్థానిక చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతుల మెరుగుదలకు వినియోగించాలని ఆమె సూచించారు.సదస్సులో పాల్గొన్న నిపుణులు మాట్లాడుతూ….. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో పరిశ్రమలు ఐఓటీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి స్మార్ట్ సాంకేతికతను వినియోగించి నీటి వృథా, లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొని పారిశ్రామిక రంగంలో నీటి నిర్వహణ, భద్రతపై విస్తృతంగా చర్చించారు.

















