ప్రతిపక్షం, జూన్ 29: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరగడంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
2018 ఎన్నికలతో పోల్చితే 2023 నాటికి కొడంగల్‌లో దాదాపు 30 వేల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని కవిత తెలిపారు. కర్ణాటకలోని సెడం నియోజకవర్గానికి చెందిన సుమారు 11 వేల మంది ఓటర్లు కొడంగల్ ఓటరు జాబితాలో కూడా ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
ఒకే వ్యక్తులు రెండు రాష్ట్రాల ఓటరు జాబితాల్లో ఎలా ఉంటారని ప్రశ్నించిన ఆమె, కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బులు మాత్రమే కాదు, ఓట్లు కూడా బదిలీ అయ్యాయా అనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఓటరు జాబితాలో అక్రమాలపై ఎన్నికల సంఘం పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.
















