ప్రతిపక్షం, జూన్ 23: హైదరాబాద్ నగరవాసులకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులో ఉండగా, దీనికి అదనంగా మరో ఆరు లేన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, శంషాబాద్ ప్రాంతాలను అనుసంధానించేలా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. సుమారు రూ.345 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు మరింత సులభతరం కానుంది.
ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే కాటేదాన్ పరిశ్రమల ప్రాంతం, మైలార్‌దేవ్‌పల్లి, పరిసర ప్రాంతాల నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకునే అవకాశం కలుగుతుంది.
నగరాభివృద్ధి, రవాణా మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని దేశంలోని అత్యుత్తమ విమానయాన కేంద్రాల్లో ఒకటిగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

















