99.86 శాతం పోలింగ్ నమోదు
కొడంగల్‌లో ఓటు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి
ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటు వేశారు.
నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 2వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా గెలవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పారిశ్రామిక వేత్త మన్నె జీవన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య రసవత్తరంగా పోటీ నెలకొంది. ఎన్నికల్లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని, దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది ఉన్నారని వారంతా బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేశారని, దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.