Trending Now

బూతులకు కేరాఫ్ అడ్రస్ ఆయనే.. బండి సంజయ్ ఫైర్

ప్రతిపక్షం, కరీంనగర్: రాజకీయాల్లో బూతులకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని, కేంద్ర మంత్రిగా ఉంటూ సహారా, ఈఎస్ఐ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. అలాంటి వ్యక్తి నిజాయితీపరుడిగా, బూతులు మాట్లాడలేదన్నట్లుగా చెప్పడం సిగ్గు చేటన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీపరుడని కేసీఆర్ సర్టిఫికెట్ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ లో రూ.500 కోట్ల విలువైన భూదాన భూములను స్వాధీనం చేసుకున్న నాయకుడు వినోద్ కుమార్ అని, దీనిపై మీడియాలో కథనాలు వస్తే కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.

స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం మంజూరు చేస్తే వాటిని దారి మళ్లించిన చరిత్ర కేసీఆర్ దేనన్నారు. ఆనాడు నిధుల దారి మళ్లింపు వినోద్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ హామీల అమలుపై ఎందుకు చర్చించలేదని, వాటి అమలుకు నిధులెందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. రసమయి బాలకిషన్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించి తన స్థాయిని దిగజార్చుకోలేనని చెప్పిన బండి సంజయ్ రసమయి రాసలీలలు, ఇద్దరు భార్యలు, భూకబ్జాల వ్యవహారంపై తమ పార్టీ నేతలు మాట్లాడాతారని చెప్పారు. కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై ఈ కామెంట్స్ చేశారు.

Spread the love