Trending Now

రుణమాఫీ పథకం అమలుపై తెలంగాణ సర్కార్ భారీ కసరత్తు..

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ..

బ్యాంకుల నుంచి వివరాలు సేకరణ..

రిజర్వ్​బ్యాంక్​ అధికారులతో సంప్రదింపులు..

రైతుల రుణాలన్నీ ప్రభుత్వ ఖాతాకు బదిలీ..

ఏడాదిలోగా రుణం చెల్లించేందుకు ఒప్పందం..

దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఎన్నికల్లో తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటను నిలబెట్టే దిశగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఒకే విడతలో రుణాలను మాఫీ చేసే దిశగా ప్రయత్నాలను మొదలెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీసుకున్న పంట రుణాలన్నింటిని రైతుల ఖాతా నుంచి ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. రూ. ఈ దిశగా రిజర్వు బ్యాంకు, బ్యాంకర్లతో ఆర్థిక, వ్యవసాయ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

లోక్​సభ ఎన్నికల లోపే..

లోక్​సభ ఎన్నికల లోపే రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ సర్కారు వేగంగా చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.2 లక్షలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను విడుదల చేసి కాంగ్రెస్​ పార్టీ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్​ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొంది. రుణమాఫీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.

బ్యాంక్​ అధికారులతో చర్చలు..

రాష్ట్రంలోని బ్యాంకర్లతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి రైతుల రుణాల మాఫీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. రెండు లక్షల రూపాయల్లోపు రైతుల అప్పుల మొత్తం రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. అంత భారీ మొత్తం ఒకేమారు చెల్లించే అవకాశం లేదు. దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కార్​కు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని దానికి కొంత మేర జమయ్యేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది.రిజర్వు బ్యాంకుతో కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా చూసేలా చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాటి కొడంగల్ సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించారు.

త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అన్న సీఎం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ చేసి రైతులను విముక్తులను చేస్తామని ప్రకటించారు.రుణమాఫీ అంశానికి సంబంధించి ఆర్బీఐ, బ్యాంకర్లతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తోంది. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు అమలు కార్యాచరణ ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు వచ్చే నెల మొదటివారంలో ఓ కొలిక్కి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన వారం రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే విధంగా బుధవారం జరిగిన కోస్గి బహిరంగసభలో సీఎం రేవంత్​ రెడ్డి వారం రోజుల్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్​ సిలిండర్​ పథకాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. మార్చి 15న రైతుబంధు, రైతుభరోసా డబ్బులను ఇవ్వనున్నట్లు తెలిపారు.

Spread the love