Trending Now

‘మోడీ..కేడీ డ్రామాలు’.. కాంగ్రెస్​ను దెబ్బకొట్టేందుకు దొంగ వేశాలు : సీఎం రేవంత్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను దెబ్బకొట్టేందుకు ఇక్కడ కేడీ..అక్కడ మోడీ అడుతున్న డ్రామాలో భాగంగానే కల్వకుంట్ల కవితను ఆరెస్ట్​ చేశారని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్​రెడ్డి ఆరోపించారు. టీవీల్లో సీరియల్స్​ను తలపించే విధంగా ఢిల్లీ లిక్కర్​ స్కాం విచారణ కొనసాగుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ, రాజ్యసభ సభ్యుడు అలీల్​కుమార్​ యాదవ్​, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డి, పీసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​తో పాటు ఖైరతాబాద్​ కాంగ్రెస్​పార్టీ అధ్యక్షుడు రోహిన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2022 నుంచి ఢిల్లీ లిక్కర్​ కేసు విచారణ కొనసాగుతున్నదని, అప్పుడు అరెస్ట్​ చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్​కు ఒక రోజు ముందు ఆరెస్ట్​ చేయడంలో మతలబు ఏంటో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని రేవంత్​కోరారు.లిక్కర్ స్కాంపై కేసీఆర్ కుటుంబం, బీజేపీ ప్రభుత్వం సీరియల్‌లో మాదిరిగా డ్రామా చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కవితను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ చేస్తున్నారన్నారు. ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు
గమనిస్తున్నారన్నారు. ముందు ఈడీ వస్తుందని.. ఆ తర్వాత మోదీ వస్తారని గతంలో అనేవారని.. కానీ నిన్న ఈడీ, మోదీ కలిసే వచ్చారని రేవంత్ సెటైర్ వేశారు. లోక్​సభ ఎన్నికల్లో అరెస్ట్​ చేశామని బీజేపీ చెప్పుకొని ఓట్లు దండుకునేందుకు, అలాగే ఆరెస్ట్​తో సానుభూతి చూపించి ఓట్లు వేసుకునేందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ ఆడుతున్న నాటకంగా ఆయన అభివర్ణించారు. కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదన్నారు. అలాగే ఆరెస్ట్​పై మోడీ కూడా స్పందించలేదన్నారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబ్ ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్ డ్రామాలు ఆపాలన్నారు.ఇద్దరు మౌనం వహించడాన్ని తెలంగాణ సమాజాన్ని ఆలోచింపచేస్తున్నదన్నారు.

వంద రోజుల పాలన సంతృప్తిగా ఉంది..

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్​ ప్రజాపాలనకు రేపటికి వంద రోజులు పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో 100 సంవత్సరాలకు సరిపడా విధ్వంసం చేశారన్న ఆయన, 100 రోజుల పాలనలో ఇందిరమ్మ రాజ్యంపై
సంపూర్ణ సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో ప్రభుత్వం పరిపాలనను బీఆర్ఎస్​ అస్తవ్యస్తం చేసిందని, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపిందని సీఎం దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేదని, తాము మాత్రం ప్రజల్లోనే ఉన్నామని తెలిపారు. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్న రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను సృష్టించామన్నారు. బీఆర్ఎస్​ టీఎస్‌పీఎస్సీని అవినీతికి అడ్డాగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టామని వివరించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కస్తామన్నారు. 8 లక్షల మంది 500 రూపాయలకే సిలిండర్ కొన్నారని.. 37 లక్షల మందికి జీరో బిల్ ఇచ్చామని తెలిపారు. మహబూబ్​నగర్​ జిల్లాతో పాటు మరో వరంగల్​ జిల్లాలో ఎన్నికల కోడ్ వల్ల ఏడు జిల్లాల పరిధిలో కొందరికి జీరో బిల్ ఇవ్వలేకపోయామని చెప్పారు. మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి అని ప్రజల్లోకి వెళ్ళామని.. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టామన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని విమర్శించారు. గత ప్రభుత్వ చిక్కుముడులు ఒక్కక్కటిగా విప్పుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్​ఎస్​కు ఐదో మనిషి కూడా మిగలడు..

“శాసనసభ సమావేశాల్లో కడియం శ్రీహరి, అంతర్గత చర్చల్లో కేసీఆర్ మా ప్రభుత్వాన్ని మనుగడ సాగనీయం, పడగొడతామని బీఆర్ఎస్​ వాళ్లు అన్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు డా.లక్ష్మణ్ ​కూడా పార్లమెంట్​ ఎన్నికల తరవాత ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. వీరి దగ్గర ఉన్నది 39, వారి దగ్గర ఉన్నది 8మంది ఎమ్మెల్యేలు. ఏ లెక్కలు కూడిన కూడా వీళ్లకు లెక్క కుదరదు. వాళ్లిద్దరు కలిసి మా ప్రభుత్వంపై కుట్రలు చేస్తే తప్ప, వాళ్లు అనుకుంటున్న కార్యాచరణ జరగగదు.​ అలా చేస్తే మేమైనా చూస్తూ ఊరుకుంటామా?”: -రేవంత్​ రెడ్డిపదేళ్ల బీఆర్ఎస్​ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచిస్తే ప్రతిపక్షం వద్ద ఎవరూ ఉండరని రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఇటు బీఆర్​ఎస్​ నేతలు అటు బీజేపీ నేతలు సైతం ప్రజలు ఎన్నుకున్న తమ ప్రభుత్వం లోక్​సభ ఎన్నికల తర్వాత పడిపోతుందంటున్నారన్నారు. ఇద్దరు కలిసి ఏదో వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే పనిచేస్తే..తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

12 వస్తాయంటూ సర్వేలు తేల్చేశాయి..

12 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. మమ్మల్ని దెబ్బతీసేందుకు బీజేపీ-బీఆర్ఎస్​ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి మోదీ చేసిందేమీ లేదని, ప్రధానిగా ఆయన చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదన్నారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదని రేవంత్‌ మండిపడ్డారు.

Spread the love