Trending Now

లోక్​సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ డేట్ ఫిక్స్..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారంలో సైతం అధికార కాంగ్రెస్​పార్టీ ముందజలో ఉంది. బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమవగా సీఎం రేవంత్​ మాత్రం అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికలకు సర్వం సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే మహబూబ్​నగర్​ అభ్యర్థిని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీనితో పాటు మరో ఆరు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి అయ్యిందని త్వరలోనే వారి పేర్లను సైతం ప్రకటించనున్నట్లు గాంధీభవన్​ వర్గాల సమాచారం. ఈనెల 6న మహబూబ్​నగర్​లో ప్రజా దీవెన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో సీఎం రేవంత్​రెడ్డి లోక్​సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు.

ఈ మేరకు శనివారంనాడు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్​తో పాటు మహబూబ్​నగర్​ లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి వంశీచంద్​రెడ్డి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ముదిరాజ్​, జి.మధుసూధన్​రెడ్డి, అనిరుద్​రెడ్డి, ఎన్నెం శ్రీనివాస్​రెడ్డి, వీర్లపల్లి శంకర్​ తదితరులు సీఎంను కలిసి ఆహ్వానించారు. అయితే మహబూబ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్​కు అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి కొడంగల్​ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయడంతో కొడంగల్​, మక్తల్​, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీడుభూములు సాగులోకి రానున్నాయి. ఈ పథకం శంఖుస్థాపన చేయడంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు కాంగ్రెస్​కు అనుకూలంగా వ్యవహరించనున్నట్లు నేతలు భావిస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం పరిధిలోని షాద్​నగర్​, మహబూబ్​నగర్​, జడ్చర్లలో అధికార కాంగ్రెస్​పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Spread the love