ప్రతిపక్షం, జూన్ 11: బీసీల సామాజిక, రాజకీయ సాధికారత కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, శ్రీకాంతాచారి వంటి ఉద్యమ వీరుల ఆశయాల సాధనకే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ప్రారంభించానని ఆమె పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లో నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో మాట్లాడిన కవిత, రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఉద్యమాల ఫలితంగానే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాలు చేసిందని చెప్పారు.
అయితే రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిన తర్వాత దాని ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని విమర్శించారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించారు.
జాతీయ స్థాయిలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన కవిత, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున 50 శాతం స్థానాలను బీసీ నాయకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా తమ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.














