ప్రతిపక్షం, జూలై 06: ఉచిత విద్య అందిస్తున్న విద్యాసంస్థల భవనాలను కూల్చివేయాలనే ప్రయత్నాలు జరిగితే తాము వెనక్కి తగ్గబోమని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలనుకుంటే కూల్చవచ్చని, అయితే ఒక్క భవంతిని కూల్చితే తాము పది కొత్త భవంతులు నిర్మిస్తామని సవాల్ విసిరారు.
పేద విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఉచిత విద్య అందించే సేవా కార్యక్రమాలను ఎలాంటి ఒత్తిళ్లు లేదా ఆటంకాలు నిలువరించలేవని అన్నారు. వేలాది మంది విద్యార్థులు ఈ విద్యాసంస్థల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని, వారి విద్యాభ్యాసం నిరంతరంగా కొనసాగేందుకు తమ కట్టుబాటు ఉంటుందని స్పష్టం చేశారు.
విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్న అక్బరుద్దీన్ ఒవైసీ, పేదలకు విద్యను అందించే కార్యక్రమాలు మరింత విస్తరిస్తామని తెలిపారు. విద్యా సేవలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
















