ప్రతిపక్షం, జూన్ 25: తెలంగాణలో నేడు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బేగంపేట వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకూడదని సూచించారు. రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ సూచించింది.
రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు తాజా వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

















